కృష్ణ కూచిపూడి నృత్య నిలయం ప్రారంభం

భీమునిపట్నం జనసేవ న్యూస్. 
        చిన్నబజార్ లో ఆదివారం కృష్ణ కూచిపూడి నృత్య నిలయం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం పూజా కార్యక్రమంతో ఈ నృత్య నిలయాన్ని ప్రారంభించారు. 
నృత్య నిలయం విద్యార్థినులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పూజా కార్యక్రమాల అనంతరం విద్యార్థినులు తమ నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా కృష్ణ కూచిపూడి నృత్య నిలయం ఫౌండర్ అండ్ డైరెక్టర్ శ్రీమతి కృష్ణవేణి ఈశ్వర్ మాట్లాడుతూ తన స్వస్థలమైన భీమునిపట్నంలో ఈ నృత్య నిలయం ఏర్పాటు చేయడం తనకెంతో అనందాన్నిస్తోందని అన్నారు.
 చిన్నతనంలో నృత్యం నేర్చుకోవడానికి తన తల్లి గారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ రోజు ఈ నృత్య నిలయం ఏర్పాటు చేసే స్థాయికి వచ్చానని అన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా, చక్కని నృత్య కళాకారులను తయారుచేయాలనే సదుద్దేశంతో ఈ నృత్య నిలయాన్ని ప్రారంభించామని ఆమె చెప్పారు. 

ఈ నృత్య నిలయం ప్రారంభించడానికి సహకరించిన తన కుటుంబ సభ్యులకు మరియు బంధుమిత్రులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా నృత్య నిలయం తమ పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులకి ఆమె తన కృతజ్ఞతలు తెలియజేసారు.

 విద్యార్థినులను గొప్ప నృత్య కళాకారిణులుగా తయారుచేయడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని శ్రీమతి కృష్ణవేణి ఈశ్వర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో నృత్య నిలయం విద్యార్థినులు, తల్లి దండ్రులు మరియు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.